తెలంగాణ కేసు ఎఫెక్ట్.. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు.. ఏమిటీ కేసు?

  • మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు
  • హైదరాబాద్ కోర్టు కేసు వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించలేదని ఆరోపణలు
  • దీనిని ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ
  • నామినేషన్ రద్దుతో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక
  • లైంగిక వేధింపుల ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదని మీనాక్షిపై ప్రైవేట్ కంప్లైంట్
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆమె దాఖలు చేసిన నామినేషన్ మంగళవారం తిరస్కరణకు గురైంది. హైదరాబాద్‌లోని ఒక కోర్టులో తనపై నమోదైన ప్రైవేట్ ఫిర్యాదు వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించలేదన్న అభ్యంతరాల నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఏమిటీ కేసు?

2025లో హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ మాజీ మహిళా కార్పొరేటర్ ఒకరు మీనాక్షి నటరాజన్‌పై ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. తనను వేధించిన అతడిపై 2022, మే నెల 7న పంజాగుట్ట, 2023 జూన్ 28న బెంగళూరులోని కుబ్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయని ఫిర్యాదుదారు వెల్లడించారు. తనను వేధించిన నాయకుడిని అరెస్టు చేయాలంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద బాధితురాలు నిరసనకు దిగారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొన్న నాయకుడి జిల్లా కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే అతడిపై చర్యలు తీసుకోవాలని పార్టీకి అనేకమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని బాధితురాలు నాడు ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్తే అతడిని సస్పెండ్ చేశామని చెప్పారని, కానీ సస్పెన్షన్‌కు సంబంధించిన ధృవపత్రం ఇవ్వలేదని తెలిపారు. ఆ తర్వాత కూడా ఆయన పార్టీలో క్రియాశీలకంగా కనిపించినట్లు బాధితురాలు ఆరోపించారు. ఈ కేసులో మీనాక్షిని నాలుగో ప్రతివాదిగా చేర్చడంతో కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది.

మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ నామినేషన్ల పరిశీలన సందర్భంగా బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తింది. మీనాక్షి నటరాజన్ అఫిడవిట్‌లో కీలక సమాచారాన్ని దాచిపెట్టారని అభ్యంతరం వ్యక్తం చేసింది. బీజేపీ వాదనతో ఏకీభవించిన రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను రద్దు చేశారు. దీంతో బీజేపీ అభ్యర్థులు తరుణ్ చుగ్, రజనీశ్ అగర్వాల్, మహేశ్ కేవత్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది "ప్రజాస్వామ్య హత్య" అని కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ వంటి అగ్రనేతలు మండిపడ్డారు. కాగా, బుధవారం మీనాక్షి నటరాజన్ ఎన్నికల సంఘాన్ని కలిసి తన వివరణ ఇచ్చారు. సదరు నోటీసు కేవలం ప్రాథమిక విచారణ దశలో ఉందని, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం దానిని అఫిడవిట్‌లో వెల్లడించాల్సిన అవసరం లేదని ఆమె వాదించారు. ఈ వ్యవహారం ఇరు పార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది.

Meenakshi Natarajan
Rajya Sabha Nomination Rejection
Congress Party
Madhya Pradesh Elections

More Telugu News